‘ఆర్ఆర్ఆర్’ ట్రయల్ షూట్.. నిజమే !

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ లకి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చాయ్. దీంతో టెలివిజన్‌ సీరియళ్లు, కొన్ని చిన్న సినిమాల షూటింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు. ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ కఠినంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ట్రయల్ షూట్ కి ప్లాన్ చేశారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడది నిజమేనని తెలిసింది. గండిపేట సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు శిరిల్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. కరోనా నేపథ్యంలో సెట్‌లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారట. పీపీఈ కిట్లు, థర్మోమీటర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు సహా భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌.అత్యధిక భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.