భారత్-చైనా దళాల మధ్య ఘర్షణకు కారణమిదే.. !

భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఒకరు. కల్నల్ సంతోష్ బాబుని టార్గెట్ చేసుకొనే చైనా దళాలు ఎటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకి టెంట్ అని తెలిసింది. దాన్ని తొలగిస్తున్న సమయంలోనే చైనా దళాలు.. భారత జవాన్లపై దాడి చేశారు. దీంతో కొందరు భారత జవాన్లు గాల్వన్‌లోయలో పడినట్టు తెలిసింది.

వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు.  అరగంట పాటు జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్‌లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించారు. మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.