‘ఫైటర్’ స్క్రిప్ట్ మార్పులపై క్లారిటీ ఇచ్చిన ఛార్మీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరతెకెక్కుతోంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ‘ఫైటర్’ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ నటి, నిర్మాత ఛార్మిని వివరణ అడిగారు.
‘మేడమ్ స్క్రిప్టు మార్పులు చేశారని వస్తున్న వార్తలపై దయచేసి స్పష్టత ఇవ్వండి. లొకేషన్‌తో పాటు కొన్ని అంశాల్ని కూడా మార్చారని తెలిసింది’ అంటూ బాధపడుతున్న ఎమోజీని షేర్ చేశారు. దీనికి ఛార్మి సమాధానం ఇస్తూ.. ‘ఎటువంటి మార్పు చేయలేదు.. చేసే ప్రసక్తే లేదు. ‘ఫైటర్’ స్క్రిప్టు బ్లాక్‌బస్టర్.. కరోనా క్రైసిస్ పూర్తిగా ముగిసిన తర్వాత షూటింగ్‌ను తిరిగి ఆరంభిస్తాం. ఈ సినిమా విషయంలో మేమంతా సూపర్ డూపర్ నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే ఒరిజినల్ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం’ అని ఛార్మి వివరణ ఇచ్చారు.
ఇక ‘ఫైటర్’ విజయ్ దేవరకొండ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకి షాక్ ఇస్తుందని ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ ఫైటర్ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. బాహుబలి సినిమాలో శివగామి పాత్రకి తనకి మంచి గుర్తింపు దక్కింది. ఫైటర్ లో తాను చేసే పాత్ర కూడా ఆ రేంజ్ పేరుని తీసుకొస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.