వలస కూలీలకి కేంద్రం గుడ్ న్యూస్


వలస కూలీలకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కూలీ కోసం ఇతర రాష్ట్రాలకి వలసపోకుండా స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బిహార్‌లోని ఖగరియా జిల్లా తెలిహార్‌ గ్రామంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా వలసకూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. వలసకార్మికులు ఎక్కువగా ఉన్న బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో దీన్ని తొలుత ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. దీని కోసం 25 రకాల పనులను గుర్తించారు. ఈ పథకం ద్వారా 125 రోజులపాటు కార్మికులకు పని కల్పించనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు 25 వేల మంది కార్మికులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.50వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం.