టెన్నిస్ స్టార్ జకోవిచ్’కు కరోనా పాజిటివ్


కరోనా మహమ్మారికి సామాన్యుడు-సెలబ్రిటీ, ధనవంతుడు-పేదవాడు, రాజు-బట్టు అనే తేడాలేవీ లేవు. అందరికీ సోకుతుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు మృతి చెందారు కూడా. తాజాగా సెర్బియన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు కరోనా సోకింది. అతని భార్య కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఆడ్రియా టూర్‌ను స్వయంగా నిర్వహిస్తున్న జకోవిచ్.. దీనిలో పాల్గొనేందుకు క్రొయేషియాలోని జదార్ నుంచి బెల్‌గ్రేడ్ వచ్చాడు. ఇక్కడ జకోవిచ్, అతని భార్య జెలెనాకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా జకోవిచ్ నే తెలిపాడు. ‘ఇక్కడ ప్రతి కరోనా కేసూ నన్నెంతో ఆవేదనకు గురిచేసింది. ఎవరికీ ఎటువంటి హానీ కలుగకూడదని కోరుకుంటున్నా. అందుకే మంచి పౌష్టికాహారం తీసుకొని, హోం క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఐదు రోజుల తర్వాత మరోసారి టెస్టులు చేయించుకుంటాం’ అని జకోవిచ్ తెలిపారు.