కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. అయితే బుధవారం ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

తమోనాశ్ ఘోష్  మృతితో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో విషాదం నెలకొంది. తమోనాశ్ ఘోష్ మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని మమతా ట్విట్ చేశారు. ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాశ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడేది ఏమీ లేదు.. ఈ ముగ్గురు ఎమెల్యేలు కోలుకుంటున్నారని సమాచారమ్.