తెలంగాణలో ఒక్కరోజే 985 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య వెయ్యికి చేరువయ్యాయ్. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో 985కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. మరో ఏడుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది.
శుక్రవారం 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,766కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 774 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 53, వరంగల్ అర్భన్‌లో 20, మెదక్‌లో 9 కేసులు నమోదు అయ్యాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టెస్టులకి రెండ్రోజుల పాటు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సేకరించిన షాంపిల్స్ టెస్టులు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు స్వచ్చంధ లాక్‌డౌన్ ని పాటిస్తున్నారు. ఈ క్రమంలో జనరల్ బజార్, బేగం బజార్, సూర్యా టవర్స్, ఛార్మినార్ వీధులు మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు.