హైదరాబాద్ లాక్‌డౌన్.. ఎంట్రెన్స్ పరీక్షల పరిస్థితి ఏంటీ ?
తెలంగాణలో జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్-2020 పరీక్ష జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జూలై 6, 7, 8 తేదీలలో ఇంజినీరింగ్ విభాగం, జూలై 8, 9 తేదీలలో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ని విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ టెస్టులని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ ని విచారించిన హైకోర్టు.. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్నది కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపిన ఏజీ(అడ్వకేట్ జనరల్).. ఎంట్రెన్స్ టెస్టుల రద్దు విషయంలో సాయంత్రంలోగా ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని తెలిపింది. దీంతో ఎంట్రెన్స్ టెస్టుల విచారణని కోర్టు సాయంత్రానికి వాయిదా వేసింది.