కొండపోచమ్మ కాలువకు గండిపై కాంగ్రెస్ ఫైర్
కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ గండి పడిన వెంకటాపుర గ్రామాన్ని టీపీసీసీ బృందం సందర్శించింది. కాలువకి పడిన గండిని పరిశీలించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, నర్సారెడ్డి తదితరులు గండిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నాణ్యతలేని కట్టడాలు చూస్తుంటే అవినీతి ఏ మేరకు జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చన్నారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు.
కాలువలకు గండి పడటం సహజం అంటున్న ఈఎన్సీకి అసలు సిగ్గుందా ? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈఎన్సీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలువకు గండి పడితేనే ఇలా ఉంటే.. ప్రాజెక్టులకు గండి పడితే పరిస్థితి మరెంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రజలే గుర్తించాలన్నారు. కాలువ గండిపడి నష్టపోయిన శివారు వెంకటాపూర్ బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.