జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్’పై సీబీఐ కేసు
జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో రూ.705 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి వీరిపై కేసు నమోదైంది. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్‌రెడ్డి సహా మియాల్, జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్ లిమిటెడ్, మరో తొమ్మిది కంపెనీలు, ఎయిర్ పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ ఆరోపించింది.