దేశంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 19వేలకుపైగానే ఉంటుంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,04,641కి చేరింది. అంతేకాకుండా, నిన్న ఒక్కరోజే 434మంది కరోనాతో మృతిచెందారు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 17,834కు చేరింది.

మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,59,860మంది కోలుకోగా మరో 2,26,947మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 18రోజుల్లో రెట్టింపు కేసులు, మరణాలు నమోదయ్యాయి. జూన్ 13వ తేదీన దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,08,993గా ఉండగా, జులై 2నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ కేసుల రికవరీ రేటు దాదాపు 60శాతంగా ఉండటం కాస్త ఊరటని ఇస్తోంది.