కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్ కన్నుమూత


బాలీవుడ్  మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.

 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా సరోజ్‌ ఖాన్‌ ప్రసిద్ధి గాంచారు. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు కూడా అందుకున్నారు.