మరో నటుడు ఆత్మహత్య

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మరవక ముందే మరో విషాదం నెలకొంది. కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ (30) ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

సుశీల్ మంచి నడుడే కాదు. ఫిట్నెస్ ట్రైనర్‌ కూడా. సినీ స్టార్స్ కి టిప్స్ చెబుతుంటారు. ఆయనకి వెండితెరపై కూడా అవకాశాలొస్తున్నాయ్. దునియా విజయ్ హీరోగా వస్తోన్న ‘సలగ’ సినిమాలో సుశీల్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలో సుశీల్ తన జీవితాన్ని ముగించేశారు.

సుశీల్ అకాలమరణం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. సుశీల్ మరణాన్ని ఆయన శ్రేయోభిలాసులు, స్నేహితులు, సహచర నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందించారు. సుశీల్ ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నా. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని భావించా. కానీ అందరినీ వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.