వికాస్ దూబే ఎన్కౌంటర్.. ఇలా జరిగింది !
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఇది ఎన్కౌంటర్ కాదు. కావాలనే చంపేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో వికాస్ దూబే ఎన్కౌంటర్ గురించి కాన్పూర్ ఐజీ ఐజీ మోహిత్ అగర్వాల్ మీడియాకు వివరించారు. మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన దూబేను పోలీసులు కాన్పూర్ తరలించేందుకు 13 వాహనాలను ఏర్పాటు చేశారు. అతని అనుచరులు దాడి చేయకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రయాణం మొదలుపెట్టారు.
దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో 690 కిలోమీటర్ల దూరం సజావుగానే సాగింది. ఎందుకైనా మంచిదని కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను కొంతసేపు ఆపారు. అన్ని పరీశీలించి లైన్ క్లియర్ అనుకున్నారు. ముందస్తుగా తనిఖీలు కూడా చేశారు. తీరా కాన్పూర్‌కు10 కిలోమీటరల్ దూరంలో ఉండగా దూబే ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి వరకు నిశబ్ధంగా ఉన్న అతడు తన సొంత ప్రాంతం కావడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. తుపాకీ తీసుకొని వాహనం దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వాహనం డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. వాహనం దిగిన దూబే పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు.
లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినిపించుకోలేదు. చేసేదేమి లేక కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతని ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయగా అప్పటికే మరణించాడని మోహిత్ అగర్వాల్ తెలిపారు.