ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా
తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్య, కూతురుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట వీరంతా తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రి (స్విమ్స్)లో చికిత్స పొందారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వచ్చేసినట్టు తెలిసింది. గత శుక్రవారమే అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1933 కరోనా కేసులు నమోదయ్యాయ్. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఒక్కరోజులోనే 846 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు ఏపీలో 29,168 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 15,412 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 13,428 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 328 మంది మృతి చెందారు.