బౌలౌట్ వెనక భారీ కసరత్తు చేశాం
2007 టీ20 ప్రపంచకప్ లో భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ టైగా మారడంతో బౌలౌట్ విధానంలో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇరు జట్లూ నిర్ణీత 20 ఓవర్లలో చెరో 141 పరుగులు చేయగా, మ్యాచ్ టైగా మారి ఫలితం కోసం బౌలౌట్ విధానానికి వెళ్లింది. అప్పుడు టీమ్ఇండియా సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్‌తో బౌలింగ్ చేయించి మూడుసార్లు వికెట్లను పడగొట్టింది. పాక్ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్లు పడగొట్టకపోవడంతో ధోనీసేన 3-0తో గెలుపొందింది. అయితే బౌలౌట్ వెనక భారీ కసరత్తు చేశామని అప్పటి బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ తెలిపారు.
వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్‌తో ‘డీఆర్ఎస్ విత్ ఆశ్’ అనే కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2007 టీ20 ప్రపంచకప్ లో పాక్ తో బౌలౌట్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. ఆ టోర్నీలో నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నాం. ఏదైన మ్యాచ్ టైగా మారితే బౌలౌట్ విధానం అమలు చేస్తారని తెలిసింది. బౌలౌట్ పద్ధతిని ప్రాక్టీస్ చేశాం. సెహ్వాగ్, ఉతప్ప, భజ్జీ నిలకడగా వికెట్లకు తాకేలా బంతులేస్తున్నారని.. పాక్ మ్యాచ్ లో వారినే ఎంపిక చేశామని తెలిపారు.