రివ్యూ : ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌

చిత్రం : ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌

నటీనటులు : సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్, టీఎన్నాఆర్, రవీంద్ర విజయ్ తదితరులు

సంగీతం: బిజిబల్

దర్శకత్వం : వెంకటేష్ మహా

నిర్మాతలు : విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్

ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్ (30 ఆగస్టు, 2020)

కరోనా టైమ్ లో ప్రేక్షకుల ఎంటర్ టైన్ మెంట్ కరువైంది. ఆ లోటుని ఓటీటీలు కొద్దిమేర తీరుస్తున్నాయ్. అయితే తెలుగు నుంచి ఓటీటీ సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాల్లో సత్యదేవ్ నటించిన సినిమాలే రెండు ఉన్నాయి. ఇటీవలే ఆయన నటించిన 47డేస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించడం, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ నిర్మించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరీ… ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌ ప్రేక్షకులని ఏ మేరుకు ఆకట్టుకుంది చూద్దాం.

కథ :

ఈగోని ర‌క‌ర‌కాలుగా చ‌ల్లార్చుకోవొచ్చేమో..? ఓసారి ఆత్మాభిమానం దెబ్బ‌తింటే మాత్రం ఊరుకోదు. అప్పుడు అది ఈగో కంటే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య’ క‌థ‌లో కీ పాయింట్ ఇదే. మ‌హేష్ (స‌త్య‌దేవ్‌) ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. అమాయ‌కత్వం, మంచిద‌నం, మెత‌క వైఖ‌రిగా ఉంటాడు. గొడ‌వ‌ల‌కు పోయే ర‌కం కాదు.

అలాంటిది.. ఓరోజు.. అనుకోకుండా ఓ వీధి రౌడీతో దెబ్బ‌లాట‌కుదిగాల్సివ‌స్తుంది. ఊరి జ‌నం ముందు దారుణంగా త‌న్నులు తినాల్సివ‌స్తుంది. ఆ అవ‌మాన భారాన్ని మోయ‌లేక‌పోతాడు మ‌హేష్‌. త‌న‌ని కొట్టిన‌వాడ్ని.. మ‌ళ్లీ కొట్టేంత వ‌ర‌కూ చెప్పులు కూడా వేసుకోన‌ని శ‌ప‌థం చేస్తాడు. ఓ మామూలు మ‌హేష్.. ఉగ్ర‌రూపం దాల్చాడా? అందుకోసం ఏం చేశాడు ? ఆయన ప్రేమకథలు ఏంటీ ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే ?

చిన్న పాయింట్ తో కథని రాసుకున్న వెంకటేష్ మహా. కథని బాగానే నడిపే ప్రయత్నం చేశాడు. పాత్ర‌ల‌న్నీ స‌హ‌జ సిద్ధంగా ఉంటాయి. మేక‌ప్ లేని మొహాలు, మెలోడ్రామా ఎరుగ‌ని న‌ట‌న‌.. ర‌క్తి క‌ట్టిస్తాయి. ఫొటోగ్ర‌ఫీ కి అర్థం చెప్పిన విధానం బాగుంది. అయితే సినిమాలో సాగదీత ఎక్కువైంది. ఒక్కోసారి దర్శకుడు కథని మర్చిపోయి బయటికి వెళ్లొచ్చాడ అనిపిస్తుంది.

ఈ చిత్రానికి ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య అనే భారీ టైటిల్ అయితే సూటు కాలేదు. ఎందుకంటే.. మ‌హేష్ ఉగ్ర‌రూపం కంటే, అమాయ‌కత్వం, మంచిద‌నం, మెత‌క వైఖ‌రి.. ఇవే ఎక్కువ‌గా ఆ పాత్ర‌లో క‌నిపిస్తాయి. ఉగ్ర‌రూపం చూడ్డానికి క్లైమాక్స్ వ‌ర‌కూ ఎదురు చూడాల్సివ‌చ్చింది.

ఎవరెలా చేశారు ?

స‌త్య‌దేవ్‌. ఆ పాత్ర‌ని అర్థం చేసుకుని ఓన్ చేసుకుని, అందులోనే ఉండిపోయాడు. పలు రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్రను సత్యదేవ్ అవలీలగా పోషించారనేది ఆయనను తెర మీద చూస్తే స్పష్టమవుతుంది. తండ్రి పాత్రతో కలిసి నటించిన సన్నివేశాల్లో సత్యదేవ్ నటన హైలెట్. నాటు క‌ట్ల బాబ్జీగా.. న‌రేష్ న‌ట‌న మెచ్చుకునేలా ఉంది.

హీరోయిన్లలో స్వాతిగా హరి చందన, జ్యోతిగా రూప తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. గ్లామర్‌కు దూరంగా ఉంటే స్వాతి పాత్రలో హరి చందన కనిపిస్తే. గ్లామరస్‌తో కమర్షియల్ విలువలకు స్కోప్ ఉన్న జ్యోతి పాత్రలో రూప కనిపించింది. గతంలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించిన టీఎన్నాఆర్‌కు సరైన పాత్ర లభించింది. సుహాస్ కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉన్న పాత్రలో మెప్పించాడు. నరేష్‌తో కలిసి ఉన్న సీన్‌‌లోని నటన సుహాస్‌ను గుర్తుంచుకునేలా చేస్తుంది.

సాంకేతికంగా :

సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అర‌కు అందాల్ని ఒడిసి ప‌ట్టింది కెమెరా ప‌నిత‌నం. పాట‌లన్నీ క‌థ‌లో భాగంగా వ‌చ్చేవే. మాట‌లు బాగున్నాయి. సంగీతం కూడా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. ‘నింగి చుట్టే’ పాట మళ్లీ మళ్లీ వినాలనే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ బిజిబల్ స్వరపరిచారు. సినిమా లెన్తీగా అనిపించింది. కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఓపికగా చూస్తే సినిమా బాగానే నచ్చుతుంది.

రేటింగ్ : 3/5