కరోనాతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా మహమ్మారికి మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. నెలరోజుల క్రిందటే మాణిక్యాల రావుకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల తాను కరోనా నుంచి కోలుకొని తిరిగొస్తానంటూ ఓ వీడియో కూడా షేర్ చేశారు.

అయితే కరోనాతో పోరాటంలో మాణిక్యాల రావు ఓడిపోయారు. ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు.

మాణిక్యాల రావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా మాణిక్యాల రావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు.