విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి !

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ సామర్థ్యం పరీక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. మృతుల్లో ప్రసాద్‌, జగన్‌ శాశ్వత ఉద్యోగులు కాగా.. మిగిలిన వారు పొరుగుసేవల కార్మికులని తెలిసింది.

హుద్‌హుద్‌ తుపాను సమయంలో పూర్తిగా ధ్వంసమైన పాత భారీ క్రేన్‌ స్థానంలో ఇటీవలే రూ.12 కోట్లతో కొత్త క్రేన్‌ను షిప్‌ యార్డు యాజమాన్యం కొనుగోలు చేసింది. నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించింది. ప్రమాద సమయంలో క్రేన్‌ కేబిన్‌లో 15 మంది ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.