ఏపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు మంచి మిత్రులుగా కనిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయుధాలు పట్టి యుద్ధం చేసేలా కనిపిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఇన్నాళ్లు సైలైంట్ గా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి నోరు తెరిచారు. ఏపీ, కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో కేంద్రం, ఏపీకి బలంగా సమాధానం చెప్పాలన్నారు.
‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కానీ ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం’ అని కేసీఆర్ అన్నారు.