తెలంగాణలో డిజిటల్ క్లాసులకి గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో స్కూల్స్ తెరచుకుంటాయని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించేశారు. తెలంగాణలోనూ సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. డిజిటల్ క్లాసులకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 20 నుంచి డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీ-శాట్‌ ఛానెళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరం సహా పలు అంశాలపై సమీక్షించారు.

సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఉంటాయని చెప్పారు. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు