కరోనా టీకా వచ్చేసింది

కరోనాకు తొలి టీకా వచ్చేసింది. కరోనా వైరస్‌పై రష్యా తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేశారు. తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు తెలిపారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలిదేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్‌.. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు.

‘కరోనా వైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన తొలిదేశంగా రష్యా నిలిచింది. భవిష్యత్తులో ఈ టీకాను భారీ స్థాయిలో మనమే ఉత్పత్తి చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా. ఈ టీకా అభివృద్ధిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచం కోసం వేసిన అత్యంత కీలకమైన ముందడుగు ఇది’ అన్నారు పుతిన్.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. 139 టీకాలు ప్రీ క్లీనికల్‌ దశలో, 25 ఫేజ్‌1లో, 17 ఫేజ్‌2లో, 7 ఫేజ్‌3లో ఉన్నాయి. ఈ రేసులో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా, మోడెర్నా-ఎన్‌ఐఏఐడీ, సైనోవాక్‌ మూడో దశలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీజింగ్ ఇన్‌స్టిట్యూట్‌, బయోన్‌టెక్‌-ఫూసన్‌ ఫార్మా, భారత్‌ బయోటెక్‌, నోవాక్స్‌, క్యాడిల్లా హెల్త్‌కేర్‌ టీకాలు ఉన్నాయి. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ధర రూ.225 ఉంటుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఒక మంచినీటి సీసా కన్నా తాము తయారు చేసే టీకా ధర తక్కువగా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.