24గంటల్లో.. 66,999 కేసులు, 942 మరణాలు !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది కరోనాతో మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా మరో 942 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 47,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

నిన్నఒక్కరోజే రికార్డుస్థాయిలో 66,999 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 16లక్షల 95వేల మంది కోలుకోగా మరో 6లక్షల 53వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న మరో 56వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70శాతంగా ఉండగా మరణాల రేటు దాదాపు 2శాతంగా ఉంది.