‘ఆది పురుష్’పై ప్రభాస్ మాట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సడెన్ సప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ సినిమాని ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ని వదిలారు. ప్రభాస్ నటించనున్న బాలీవుడ్ చిత్రం పేరు ‘ఆది పురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆది పురుష్ టైటిల్ లోగోని ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ‘ఎ’ అనే అక్షరంలో వీర హనుమాన్ చిత్రం, కొందరు రాక్షసుల చిత్రాలు ఎంబోజ్ అయి ఉన్నాయి. కొన్ని పురాతన ఆలయాల చిత్రాలు, విల్లెక్కు పెట్టిన యోధుడి నీడ కనిపిస్తోంది.

ఈ సినిమాపై ప్రభాస్ స్పందించారు. “ప్రతి పాత్ర, ప్రతి అవకాశం వెనుక ఎన్నో సవాళ్లుంటాయి. కానీ, ఈ తరహా క్యారెక్టర్ ను పోషించడం ఎంతో గర్వకారణం. బాధ్యతగా చేయాల్సిన పాత్రిది. ఈ పాత్రను పోషించేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను. ఈ క్యారెక్టర్ ను ఓమ్ డిజైన్ చేసిన తీరు అద్భుతం. దేశ యువత, ఈ చిత్రాన్ని ఆదరిస్తుందన్న నమ్మకం నాకుంది” అని ప్రభాస్ తెలిపారు.