పవన్ మార్క్ తో ‘ఆచార్య’ ప్రీ-లుక్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని వదలనున్నారు. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ వదిలిన ప్రీ లుక్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మార్క్ కనబడింది.ఎర్ర కండువా అనగానే సినిమాల్లో ఎవరికైనా పవన్ కల్యాణ్ గుర్తుకురావడం కామన్. పవన్ పిడికిలి బిగించి, ఎర్ర తువ్వాలు మెడలో వేసుకుని రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనడం చూశాం.

ఇప్పుడు చిరంజీవి 152వ సినిమా ప్రీ లుక్ పోస్టర్ లోనూ పిడికిలి బిగించిన చేయి ఓ ఎర్ర గుడ్డని పట్టుకుని కనిపిస్తుంది. సరిగా చూస్తే ఇది పవన్ కల్యాణ్ మార్క్  నే. ఈ పోస్టర్ తో పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ప్రీ-లుక్ పోస్టర్, పవన్ ఎర్ర కండువా ఎగరేసే పోస్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో చిరుకి జంటగా కాజల్ నటిస్తోంది. ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న ఆచార్య.. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.