కరోనాకు ఏకైక మందు ధైర్యమే : ఈటెల
మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ప్లాస్మా దానం చేసేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన donateplasma.hcsc.in వెబ్‌సైట్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు 94906 16780, 040-23434343 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమని వివరించారు. ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చిందన్నారు. కొవిడ్ ఔషధాలతో పాటు ప్లాస్మా చికిత్స ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందన్నారు.