గ్రేటర్’లో కరోనా కిట్స్ అందడం లేదు

కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయి.. హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులకు ప్రభుత్వమే కిట్‌ రూపంలో మందులు, ఇతర వస్తువులు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్‌ వ్యాప్తంగా హైదరాబాద్‌లో 97, రంగారెడ్డిలో 20, మేడ్చల్‌లో 79 ప్రాథమిక, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిత్యం 250 పైనే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 85-90 శాతం మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులకు డిమాండ్‌కు తగ్గట్లు కిట్లు సరఫరా కావడం లేదు. 48 గంటలు గడిచినా కిట్‌ అందడం లేదని కరోనా బాధితులు వాపోతున్నారు. కొన్ని సార్లు 3-4 రోజులు పడుతుందని చెబుతున్నారు. తమకు కిట్లు అందడం లేదని గ్రేటర్‌ నుంచి వందలాది మంది ప్రభుత్వ కాల్‌ సెంటర్‌కు ఫోన్లు చేస్తున్నారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిత్యం 150-200 మందికి పరీక్షలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో పది లోపే కేసులు బయట పడుతున్నాయి. మరికొన్ని కేంద్రాల్లో 30-50 మందికి వైరస్‌ నిర్థారణ అవుతోంది. కొవిడ్‌ ఉన్నట్లు తేలితే సంబంధించి ఆరోగ్య కేంద్రం సిబ్బంది.. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి కిట్‌ అందించాలి. అయితే రకరకాల కారణాలతో కిట్లు అందడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని చెబుతున్నారు.