శ్రీశైలం అగ్నిప్రమాద ఘటన.. 9 మంది మృతి !
శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో లోపలే చిక్కుకుపోయిన 9మంది మృతి చెందారు.ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఏఈ మోహన్‌కుమార్, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్‌గా గుర్తించారు. సహాయక చర్యల్లో సీఐఎస్ఎఫ్, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో తొలుత ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జలవిద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా.. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకు పోయారు. ఆ 9 మంది మృతివాత పడటంతో విషాద ఛాయలు నెలకొన్నాయి.