కరోనా టెస్టులు.. అమెరికాతో విబేధించిన డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం(సీడీసీ) మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటితో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) విభేదించింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది.
కొవిడ్ కట్టడిలో భాగంగా అధికారులు చేపడుతున్న చర్యల్లో పరీక్షల్ని మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరముందని డబ్ల్యూహెచ్‌వో కు చెందిన ప్రముఖ అధికారి మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదొక్కటేనని పునరుద్ఘాటించారు. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తికి ఆరడుగుల దూరంలో 15 నిమిషాల పాటు గడిపిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని సంస్థ సూచించిన విషయం తెలిసిందే.