నూతన్ నాయుడుతో జనసేనకు సంబంధం లేదట !
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో ఓ దఌత యువకుడికి శిరోముండన చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ పుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అయితే నూతన్ నాయుడు జనసేన మనిషి. పవన్ అభిమాని అనే ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్నిజనసేన, పవన్ కల్యాణ్ కు లింకుపెట్టి కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కాదని స్పష్టంచేశారు.
‘పవన్ కల్యాణ్ అన్యాయానికి కొమ్ముగాసే నేత కాదని ప్రతిఒక్కరికీ తెలుసు. ఎక్కడ అన్యాయం జరిగినా జనసేన వ్యతిరేకిస్తుంది. బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఏపీలో దళితులపై జరిగిన అకృత్యాలపై పవన్ బలంగా స్పందించిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. పవన్ లక్షలాది అభిమానులు ఉన్న సుప్రసిద్ధ హీరో. నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలో పవన్ పేరు తీసుకురావడం గర్హనీయం. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాం. ప్రమేయం లేని విషయాల్లో పార్టీని గానీ, అధ్యక్షుడిని గానీ, మా పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావించిన ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.