జీఎస్టీ ప్రతిపాదనలు.. కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం !

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జీఎస్టీ పంచాయతీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకే దేశం.. ఒకే పన్ను నినాదంతో 2017 నుంచి జీఎస్టీని కేంద్రం అమలు చేస్తోంది. పెట్రోల్‌, మద్యం మినహా దాదాపు అన్నింటిని జీఎస్టీలోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం జీఎస్టీ రాబడులపై పడగా.. ఆదాయం చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాల ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది.

ఇందులో ఒకటి : కేంద్రం ఆర్‌బీఐ ద్వారా రుణంగా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తుంది. అసలు, వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది. రూ. 97వేల కోట్ల అంచనాతో మొదటి ప్రతిపాదన చేసింది కేంద్రం.

రెండో ప్రతిపాదన : కరోనాతో నష్టపోయిన జీఎస్టీ రూ.2.37లక్షల కోట్ల రుణాల ద్వారా సమకూర్చనుంది. ఇందులో అసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీని రాష్ట్రాలు చెల్లించుకోవాలని చెప్పింది. మొదటి ప్రతిపాదనకు అంగీకరిస్తే రాష్ట్రానికి పరిహారం భారీగా తగ్గనుంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. రెండో ప్రతిపాదనను పరిశీలిస్తే వడ్డీ భారం పడనుంది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జీఎస్టీపై కేంద్రం ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇక ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం ప్రతిపాదనలపై మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.