భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన సింగర్ నోయల్ !


సింగర్ నోయల్ సడెన్ షాక్ ఇచ్చారు. ఆయన గత యేడాది జనవరిలో హీరోయిన్ ఎస్తర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఆశీర్వదించారు. నోయల్-ఎస్తర్ జంట అందంగా కనిపించింది. వీరి వైవాహిక జీవితం కూడా మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని భావించారు. కానీ యేడాది తిరగేలోగా.. ఈ జంట విడిపోయేందుకు రెడీ అయింది.

తాజాగా భార్య ఎస్తర్ తో విడిపోతున్నట్టు ట్విట్ చేశారు నోయల్. ‘కోర్టు తమ విడాకుల విషయంలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దాని కోసం ఎదురు చూస్తున్నాం. ఈ విషయంలో ఎవరు కూడా ఎస్తర్ లేదా ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధల వలన విడాకుల వరకు వెళ్లాం.ఓ అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడేందుకు మేము ఇలా విడిపోయాం. దేవుడు ఎస్తర్‌ని చల్లగా చూడాలి. ఆమె కన్న కలలు నిజం కావాలి. కష్ట కాలంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని నోయల్ రాసుకొచ్చారు.

ఎస్తర్ నటిగా బిజీగా ఉంది. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇక నోయల్ బిగ్ బాస్ 4 లో పాల్గొనబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వారమే బిగ్ బాస్ 4 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.