తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం.. 45 రోజుల్లో సమస్య పరిష్కారం !

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా.. భూ సమస్యని కేవలం 45 రోజుల్లో పరిష్కారం అయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 144 చట్టాలు లేదా నియమాల్లో కాలం చెల్లినవాటిని తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందిస్తోంది. 

ఇందులో భాగంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్‌ అబ్నార్‌ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ కొత్త చట్టం తయారీపై కసరత్తులు చేస్తోంది. రెవెన్యూ ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు వంటి అంశాలపై ఉన్నతాధికారలు చర్చలు జరుపుతున్నారు.

భూ వివాదాలు 45 రోజుల్లో పరిష్కారం కాకుంటే.. అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదిస్తారు. అక్కడా తీర్పు సంతృప్తికరంగా లేకుంటే రెవెన్యూ కోర్టుకు అప్పీల్‌ చేసుకునేలా కొత్త విధానం తీసేకురానున్నారు.