ఒకరోజు కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 83,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. ఈ లెక్కన ఒక్కరోజులో నమోదైన కరోనా కొత్త కేసుల సంఖ్యలో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్టయింది.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 1043 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 67,376కు చేరింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్సపొందుతున్నారు. నిన్న మరో 68వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.