‘థ్యాంక్స్’లతో షాక్ ఇస్తున్న పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డె సెలబ్రేషన్ ముగిశాయ్. దాదాపు రెండ్నెళ్ల ముందు నుంచే ప్రారంభమైన బర్త్ డే సెలబ్రేషన్స్ బుధవారం (సెప్టెంబర్ 2) అర్థరాత్రితో ముగిశాయి. అభిమానులు, సెల‌బ్రెటీలంతా ప‌వ‌న్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్ల‌ను హోరెత్తించారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ ప‌వ‌న్ రిప్లైలు ఇస్తూ.. కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాడు. 

అంద‌రికీ అంటూ ఒక ట్వీట్ తో స‌రిపెట్ట‌కుండా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన వారికి పేరు పేరున ప్ర‌తి ఒక్క‌రికీ.. ప్ర‌త్యేకంగాక్ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవ‌డం విశేషం. నితిన్‌, సుధీర్ బాబు, కార్తికేయ‌, స‌త్య‌దేవ్‌.. వీళ్లంద‌రికీ ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా ట్వీట్ చేశాడు. కార్తికేయ‌ని ‘సార్’` అంటూ సంబోధించ‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది. ‘సార్ ఏంటి సార్‌.. మీకున్న కోట్లాది అభిమానుల్లో నేనొక‌డిని` అంటూ కార్తికేయ మురిసిపోతున్నాడు. బన్నీకి పవన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి పవన్ థ్యాంక్స్ లతో షాక్ ఇస్తున్నారు.

ఇక పవన్ బర్త్ డే కానుకగా అభిమానులకి బహుమతులు క్యూ కట్టాయి. వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్, పవన్-క్రిష్ సినిమా ప్రీ లుక్, పవన్-హరీష్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్లు వచ్చాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమా ప్రకటన వచ్చేసింది. వాటితో పవన్ ఫ్యాన్స్ కడుపునిండిపోయింది. అంతేకాదు.. ఇక పవన్ ఫుల్ టైమ్ సినిమాలు చేయబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది.