అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలి : కేసీఆర్
ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రులు, విప్ లతో సీఎం గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సిఎం ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై ఎన్ని రోజులైనా సరే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. చర్చలు స్ఫూర్తిమంతంగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా, దేశానికి ఆదర్శంగా ఉండేలా సమావేశాలు జరగాలన్నారు సీఎం కేసీఆర్.
ఏ పార్టీ సభ్యులైనా, ఏ విషయం గురించైనా సభలో మాట్లాడవచ్చు. దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యులు మాట్లాడే విషయాలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి సీఎం కేసీఆర్ అన్నారు.