పోలీసుల కరోనా సేవలని ప్రశంసించిన ప్రధాని
కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం, కరోనా కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారుని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు.
‘ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వేళ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖాకీల మానవీయ కోణం ప్రజలకు తెలిసింది. ఈ కష్టకాలంలో పోలీసుల పాత్రను చరిత్రలో లిఖించారు. ఐపీఎస్ ప్రొబేషనర్లను గతంలో ఇంటికి ఆహ్వానించే వాడిని. కొవిడ్ కారణంగా ముఖాముఖి కలుసుకోలేకపోతున్నా. త్వరలోనే మీతో సమావేశమవుతా’ అన్నారు ప్రధాని. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, జితేంద్రసింగ్, వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది 131 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 121 మంది 2018 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. మరో 10 మంది 2017 బ్యాచ్‌కు చెందినవారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.