తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు : ఎమ్మెల్యేలు ఈ కండీషన్స్ పాటించాల్సిందే
సోమవారం (సెప్టెంబర్ 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు కండీషన్స్ పెట్టారు. వాటిని మీడియాకు వివరించారు. ప్రతి సభ్యులు అంటే.. ప్రతి ఎమ్మెల్యే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. కరోనా రిపోర్ట్ తోనే సమావేశాలకి హాజరవ్వాలి. నెగటివ్ రిపోర్ట్ వస్తేనే సమావేశాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
జ్వరం రాకున్నా, దగ్గు, జలుబు లాంటివి ఉన్నా సభకు రావొద్దని సభ్యులకు సూచించారు. అసెంబ్లీకి వచ్చే పోలీస్, మీడియా ఇతర శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా వుండాలని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి లేదు. మంత్రుల పీఎస్‌లకు అనుమతి ఉంది. సభ ఎంట్రెన్స్‌లోనే థర్మల్ టెస్టింగ్, శానిటైజర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.పార్లమెంట్లో అమలు చేస్తున్న కోవిడ్ నిభందనలే ఇక్కడ అమలు చేస్తున్నాం. సభ 20 నుంచి 21 రోజులు జరగొచ్చని స్పీకర్ పోచారం తెలిపారు.