కరోనా కేసులు.. 2వ స్థానంలోకి భారత్ !
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 90వేలకు దాటేసి.. లక్షకి చేరువగా నమోదవుతున్నాయి. మరో వారంలో ప్రతిరోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలోకి వచ్చింది.
కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్లో ఇప్పటి వరకు 41లక్షల 37వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ సంఖ్యని భారత్ దాటేసింది. సోమవారం ఉదయానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 4వేల (42,04,613)కు చేరింది. గడిచిన 24గంటల్లో భారత్ లో 90,802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిన్న ఒక్కరోజే భారత్ లో 69వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.90వేల మార్కును దాటడం వరుసగా ఇది రెండోసారి. అంతకుముందురోజు కంటే మరో 170 కేసులు అదనంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల్లో ఇప్పటికే 32లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల 82వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతంగా ఉంది.