కంగనా వై కేటగిరి భద్రత.. వెనక రాజకీయం !?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కేంద్రం భద్రత పెంచిది. ఆమెకు వై కేటగిరి భద్రతని ఏర్పాటు చేసింది. ‘కంగన హిమాచల్‌ కుమార్తె. ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేసింది’ అని ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ అన్నారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బంధుప్రీతి, డ్రగ్స్ మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా బాలీవుడ్‌ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే ఎక్కువ భయంగా ఉందని విమర్శించారు.

దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. కంగన ముంబయి రాకుండా తన స్వస్థలంలోనే ఉండాలని సూచించారు. ఈ వివాదం ముదిరి కంగనా వర్సెస్ శివసేన మారింది. ఈ క్రమంలోనే కంగనాకు కేంద్రం వై కేటగిరి భద్రతని ఏర్పాటు చేసింది. అయితే దీని వెనక రాజకీయ కోణం కూడా ఉంది. కంగనాని భాజాపా ఆహ్వానిస్తోంది. భవిష్యత్ లో కంగనా భాజాపాకు ప్రచారం చేయడం లేదా భాజాపాలో చేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇక తనకు ‘వై ప్లస్‌’ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘జాతీయ వాదుల స్వరాన్ని ఎటువంటి శక్తులు అణచివేయలేవు అనడానికి ఇది రుజువు. ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలో ఉంచుకుని.. నన్ను ముంబయికి వెళ్లమని చెప్పిన అమిత్‌ షాకు రుణపడి ఉంటాను. ఆయన ఈ దేశపు కుమార్తె మాటల్ని గౌరవించారు. జై హింద్’ అని పేర్కొన్నారు.