భారత సైనికుల సిక్‌లీవులు.. అది తప్పుడు ప్రచారం!

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో జూన్‌లో జరిగిన వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరులవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.ఇటీవల భారత్‌, చైనా సైన్యాల మధ్య ఇటీవల గాల్లోకి కాల్పుల సంఘటన చోటుచేసుకోవటంతో సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. ‘లద్దాఖ్‌ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45 సంవత్సరాల్లో తొలిసారిగా 80,000 మందికి పైగా భారత సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తు చేసుకున్నారు’ అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ అసత్యాలని ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఈ కారణంగా భారతీయ సైనికులు ఎవరూ సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా స్పష్టం చేశాయి.