కేంద్ర వ్యవయసాయ బిల్లుకు తెరాస వ్యతిరేకం, వైకాపా మద్దతు !

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆదివారం ఉదయం వ్యవసాయ సంబంధ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని ఈ సందర్భంగా తోమర్ అన్నారు. అయితే ఈ బిల్లుపై రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నంగా స్పందించాయి. ఈ బిల్లుని తెలంగాణ వ్యతిరేకించింది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని తెరాస ఎంపీ కె.కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచి పోషించేలా ఉందన్నారు. ఒక్కో క్లస్టర్‌లో 1.65 లక్షల మంది రైతులు ఉన్నారు. కేంద్ర ఏ పథకానికీ సరిగా నిధులు ఇవ్వడం లేదు. వ్యవసాయం, సంబంధిత అంశాలు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. ఈ కొత్త చట్టం రైతులకు అండగా నిలిచేలా లేదని కేకే అన్నారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ బిల్లుకు మద్దతిచ్చింది.వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక తెదేపా మాత్రం బిల్లుపై మరింత స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది