డబుల్ బెడ్ రూమ్స్.. ఏమైనా డైలీ సీరియల్‌లా ?

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్-తెరాస డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సవాల్ విసురుకున్న సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని కట్టామని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క్ చూస్తానంటే చూపిస్తామని మంత్రి తలసాని విసిరిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ ని బట్టీ స్వీకరించడం.. రెండ్రోజులు భట్టీకి తలసాని ఇళ్లని చూపించడం జరిగింది. అయితే అన్నీ కలిపి 5వేల ఇళ్లని కూడా చూపించలేదని భట్టీ విమర్శించారు.

తాజాగా దీనిపై మంత్రి తలసాని స్పందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు కట్టి తీరుతామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై డైలీ సీరియల్‌లా మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. మొత్తం 111 చోట్ల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

బయట కడుతున్న ఇళ్లలో స్థానికులకు పది శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు 90 శాతం కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ హైదరాబాద్‌ బయట ఇళ్లు కట్టేందుకు జీవోలు ఇచ్చారని ఈ సందర్భంగా తలసాని గుర్తు చేశారు. సొంత స్థలం ఉంటే ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీపై వెనక్కి తగ్గేది లేదన్నారు తలసాని.