ఢిల్లీని గెలిపించింది అంపైర్ నే !


ఐపీఎల్13లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ (ఢిల్లీ వర్సెస్ పంజాబ్) సూపర్ కిక్కునిచ్చింది. మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసి సూపర్ థ్రిల్ ని పంచింది. అయితే సూపర్ ఓవర్ తో ఢిల్లీ ఈజీగా గెలిచేసింది. నిజానికి ఢిల్లీని గెలిపించింది మాత్రం అంపైర్ నే. అంపైర్ తప్పిదం వలన ఈజీగా గెలవాల్సిన పంజాబ్ ఓడిపోయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంపైర్ కే ఇవ్వాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్ చేయడం విశేషం.

సెహ్వాగ్ చెప్పింది నిజమే.మొదట బ్యాటింగ్‌ చేసి దిల్లీ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం లభించలేదు. దాదాపు 15 ఓవర్ల వరకు నెమ్మదిగానే ఆడింది. అయితే మయాంక్‌ అగర్వాల్‌ (89; 60 బంతుల్లో 7×4, 4×6) గేర్లు మార్చడంతో విజయానికి చేరువైంది. ఈ క్రమంలో రబాడ వేసిన 18.3వ బంతిని అగర్వాల్‌ ఆడాడు. రెండు పరుగులు తీశారు. క్రిస్‌ జోర్డాన్‌ బ్యాటును క్రీజులో ఉంచలేదని లెగ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఒక పరుగు కోత విధించాడు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం అనగా కింగ్స్‌ 12 పరుగులే చేసింది. మ్యాచ్‌ టై అయింది.

నిజానికి కోత విధించిన పరుగూ కలుపుకుంటే రాహుల్‌ సేన విజయం సాధించినట్టే. అంపైర్ తప్పిదం వలన మ్యాచ్ పంజాబ్ కి దూరమైంది. ఊహించని మలుపు తిరిగింది. సూపర్ ఓవర్ కి వెళ్లింది. అయితే సూపర్ ఓవర్ లో మాత్రం పంజాబ్ తడపడింది. కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. 2 పరుగులని ఢిల్లీ రెండు బంతుల్లో చేధించి గెలుపొందింది.