వైఎస్ భారతి తండ్రికి అనారోగ్యం.. హుటాహుఠిన హైదరాబాద్ బయలు దేరిన సీఎం జగన్ !


ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి తండ్రి అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తిరుపతి పర్యటనని ముగించుకొని అమరావతి వెళ్లాల్సిన సీఎం జగన్.. తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ కు పయనమయ్యారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కంటినెంటల్ హాస్పటల్ కి చేరుకొని మామని పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి అమరావతికి బయలు దేరనున్నారు.

ఇక సీఎం జగన్ తిరుమల పర్యటన ప్రశాంతంగానే ముగిసింది. డిక్లరేషన్ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతంగా మారే అవకాశాలున్నాయనే అనుమానాలు కలిగాయి. అయితే అంతా ప్రశాంతాంగా సాగిపోయింది. సీఎం రెండు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ప్రభుత్వం తరుపున స్వామి వారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కర్నాటక సీఎం యడ్డ్యూరప్పతో కలిసి మరోసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు జగన్. అనంతరం కర్నాటక చౌల్ట్రి వద్ద రూ.200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ హైదరాబాద్ కి పయనమయ్యారు.