దేశంలో కొత్త కేసులు.. రికవరీ సమానం !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అదే సమయంలో రికవరీ సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 86,507 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అదే సమయంలో 86వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసులతో పాటు రికవరీ పెరుగుతుండంతో కాస్త ఊరట కలిగిస్తోంది. కరోనా మహమ్మారిపై ప్రజల్లోనూ స్పష్టమైన అవగాహన రావడంతో.. చాలా త్వరగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  57,32,518కు చేరింది.  వీరిలో ఇప్పటికే 46లక్షల 74వేల మంది కోలుకోగా, మరో 9లక్షల 66వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న మరో 1129 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 91,149కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81.55శాతం ఉండగా, మరణాల రేటు 1.59శాతంగా ఉంది.