ఎయిర్టెల్, వొడాఫోన్ లకు భారీగా గండికొట్టిన జియో
టెలికాం సంచలనం జియో చందాదారులని భారీగా పెంచుకొంది. అదే సమయంలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ చందాదారులను కోల్పోయాయి. జూన్ నెలలో కొత్తగా 45 లక్షల మంది చందాదారులు ఆ నెట్వర్క్ను ఎంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ సంస్థ 39.72 కోట్ల సబ్స్క్రైబర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూన్ నెలలో భారతీ ఎయిర్టెల్ 11.2 లక్షలు, వీఐ 48.2 లక్షల వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్ వెల్లడించింది.
ప్రస్తుతం ఎయిర్టెల్ 31.66 కోట్ల చందాదారులతో రెండో స్థానంలోనూ, వీఐ 30.51 కోట్ల చందాదారులతో మూడో స్థానంలో నిలిచాయి. గతంలో 34.33 శాతంగా ఉన్న జియో మార్కెట్ వాటా ప్రస్తుతం 34.82కి పెరిగింది. 27.78 శాతంగా ఉన్న ఎయిర్టెల్ వాటా ప్రస్తుతం తగ్గి 27.76 శాతానికి చేరుకుంది. వీఐ వాటా 27.09 శాతం నుంచి 26.75 శాతానికి తగ్గింది.