కరోనా పరీక్షలు.. మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు !
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పలుమార్లు హైకోర్ట్ అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. కరోనా చికిత్సని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు. తాజాగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు కొన్ని రోజులు ఎక్కువగానూ మరి కొన్నిరోజులు తక్కువగా చేస్తున్నారని అభిప్రాయపడింది. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపింది. కానీ దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ? అని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు తదితర అంశాలపై దాఖలైన 24 వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఐదు పడకలు ఉండాలని.. కానీ రాష్ట్రంలో ఒకటే ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది