బాలు ఆరోగ్యం.. అసలు పరిస్థితి ఏంటంటే ?
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు గురువారం సాయంత్రమే ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు బాలు హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఆ ప్రకటన తర్వాత బాలు ఆరోగ్యం మరింత విషమించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి దాటాక మరోసారి బాలు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. దీంతో ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? అన్నది తెలియక ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రి వర్గాల సమాచారమ్ ప్రకారం… బాలు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ఆయనకి వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్స చేస్తున్నారు. అయితే నిమిషం నిమిషానికి బాలు పల్స్ రేట్ పడిపోతున్నట్టు తెలిసింది. బాలు పక్కనే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నిన్న సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వచ్చిన కమల్… ఈ ఉదయం మరోసారి వస్తున్నారని తెలిసింది. బాలు అత్యంత సన్నిహితుడు దర్శకుడు భారతీరాజా కూడా ఆసుపత్రికి రానున్నారు. ఆ తర్వాత బాలు ఆరోగ్యంపై ప్రకటన చేయబోతున్నారని సమాచారమ్. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ కూడా ఎప్పటికప్పుడు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడుతున్నారని తెలిసింది. ఆయన కూడా ఆసుపత్రికి వచ్చి.. బాలు ఆరోగ్యం ఎలా ఉందని.. ఏ చికిత్స అందిస్తున్నారని తెలుసుకోనున్నారని తెలుస్తోంది.