ఎన్సీబీ ముందుకు దీపికా పదుకొనె


డ్రగ్స్ కేసుకు సంబంధించి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎన్సీబీ విచారణకు వచ్చారు. ముంబైలోని కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు ఈ ఉదయం దీపికా వచ్చారు. అక్కడే ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి దీపికాని ఎన్సీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. నిన్న దీపికా మేనేజర్ కర్మిష్మా ప్రకాష్ ఎన్ సీబీ విచారణకు హాజరయ్యారు. ఆమె ఈరోజు కూడా విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. అవసరమైతే దీపిక, ఆమె మేనేజర్ ని కలిపి విచారించనున్నారు ఎన్ సీబీ అధికారులు.

శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లకి కూడా ఎన్ సీబీ అధికారులు ఈరోజే విచారించనున్నారు. అయితే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారించనున్నారు. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్ సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెని విచారించారు. తన ఇంట్లో రియా డ్రగ్స్ దాచిపెట్టింది. కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కరణ్‌ జోహార్‌ సహాయకులు క్షితిజ్‌ ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్‌సీబీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో డ్రగ్స్ కేసులో కరణ్ కు కూడా సంబంధాలున్నాయనే చర్చ మొదలైంది.